ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. కొంత మంది టికెట్ దక్కక వైసీపీ నుంచి టీడీపీలో చేరితే.. మరికొందరూ వైసీపీలో ఇలా రకరకాలుగా పార్టీలను మారుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ప్రతిపక్ష టీడీపీ-బీజేపీ-జనసేన మాత్రం కూటమిగా బరిలోకి దిగనున్నాయి. దీంతో ఎలాగైనా అధికారంలోకి వస్తాం అనే ధీమాలో ఉన్నారు.
వైసీపీ మాత్రం వై నాట్ 175 అంటూ ప్రచారం చేస్తూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరడం పై ఓ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీఏలో చేరాం అని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం మేరకే రాష్ట్ర సమస్యలపై పోరాడే నేతలను అభ్యర్థులుగా నిలబెడుతున్నామని చెప్పారు. వారిని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఇప్పటివరకు 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని.. మిగిలిన 5 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు క్యాండిడేట్లను త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు.