ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నిన్న రాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత జీరో నెంబర్ జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి.
సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లు అన్నింటిని హార్బర్ లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల కిందట సముద్రం పైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి. వారిలో రూ. లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ. 5 నుంచి రూ. 6 లక్షల విలువైన చేపలు ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులే నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.