అదేం చిత్రమో.. అంతా చూసినట్టు.. పక్కనే కూర్చున్నట్టు .. రాసే రాతలు గమ్మత్తుగా ఉంటాయి. మొత్తం తమకే తెలుసునని.. అంతా తమ కనుసన్నల్లోనే జరిగిందనే ధోరణిలో చంద్రబాబు అనుకూల మీడియా వెలువరించిన ఓ వార్తా కథనంపై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నిన్నటికి నిన్న సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల సేపు ఈ సమావేశం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే, దీనికి సంబంధించి ఏపీ సర్కారు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. నిజానికి సీఎంలు ఎవరైనా ఢిల్లీ పర్యటనకు వెళ్తే.. అక్కడ ఏం జరిగిందనే విషయాలపై ప్రభుత్వమే అధికారికంగా నోట్ విడుదల చేస్తుంది.
గతంలో జగన్ పర్యటించిన సమయంలో కూడా ప్రభుత్వం అక్కడి విశేషాలపై నోట్ విడుదల చేసింది. కానీ,ఈ సారి 40 నిముషాల పాటు ప్రధానితో భేటీ అయినప్పటికీ.. అక్కడేంమాట్లాడారనే విషయంపై మాత్రం సర్కారు మౌనం వహించింది. సరే! ఇదే విషయాన్ని మిగిలిన ప్రధాన మీడియా ఇదే విధంగా ప్రసారం చేసింది. కానీ, ఘనత వహించిన ఆర్కే గారి చంద్రబాబు అనుకూల బాకా మాత్రం పూసగుచ్చినట్టు.. అంటే.. జగన్ గడపదాటి.. మోడీ సమావేశ మందిరంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన తిరిగి కారులోకి ఎక్కే వరకు కూడా ఏం జరిగిందో రాసుకొచ్చింది.
న్యాయవ్యవస్థపై జగన్ ఫిర్యాదులు చేశారని, ఏపీలో హైకోర్టు తనను పనిచేసుకోకుండా అడ్డు తగులుతోందని ప్రదాని మోడీకి వివరించారని రాసుకొచ్చింది. అంతేకాదు.. ఆర్కే ఈ సమావేశంలో కర్టెన్ చాటున నక్కి విన్నట్టుగా.. మోడీ ఈ విషయంపై ఓ చిరునవ్వు రువ్వి.. అదంతా నువ్వు.. అమిత్ షాతో చెప్పిందేకదా.. ఇంకేమైనా ఉంటే.. చెప్పు అన్నాడని రాసుకొచ్చింది. దీంతో ఇక, పోలవరం నిధులు, మూడు రాజధానులపై జగన్ ఏకరువు పెట్టడంతో ఛ! ఎప్పుడొచ్చినా.. ఇవే అడుగుతావు..ఇంకేమైనా ఉంటే.. చెప్పు అని మోడీ.. ప్రశ్నించాడట.
షాక్ అయిన జగన్ మౌనంగా ఉండి.. గతంలో ఇచ్చిన విన్నపాల నకలు ప్రతినే ఇచ్చి వచ్చేసి.. నేరుగా కారెక్కాడట..! ఇదీ.. ఆర్కే గారు వేసిన పంచ్! చిత్రమేంటంటే.. ఇతర పత్రికలు ఏవీ కూడా న్యాయవ్యవస్థపై జగన్ మోడీకి ఫిర్యాదు చేసినట్టు రాయలేదు. కానీ, ఆర్కే గారు మాత్రం తలుపుచాటున, కర్టెన్ మాటున ఉండి వినేసి.. తన పాఠకులకు హాట్ న్యూస్ అందించారట!! ఇదీ ఇప్పుడు సోషల్ మీడియాలో పేలుతున్న సటైర్..!!
-vuyyuru subhash