ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు మధ్యంతర బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 5న గవర్నర్ నజీర్ ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. మొదటి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తదనంతరం ఫిబ్రవరి 6, 7 తేదీల్లో మధ్యంతర బడ్జెట్ పై చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వం ఆమోదం కోసం వివిధ బిల్లులకు ముఖ్యమైన సవరణలను కూడా సమర్పించనుంది. ఈ మేరకు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.