రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. నగదు బదిలీపై కీలక ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్‌ లో రేషన్‌ బియ్యంకు సంబంధించి.. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా రేషన్‌ బియ్యం వద్దంటే.. డబ్బులిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు బియ్యం వద్దు.. డబ్బులు కావాలంటే.. డిక్లరేషన్‌ తీసుకుంటామని చెప్పారు. ఆ నగదు వారి అకౌంట్‌ లో జమ చేస్తామని ప్రకటన చేశారు.

రేషన్ కార్డు
రేషన్ కార్డు

మళ్లీ రేషన్‌ బియ్యం కావాలన్నా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే ఓ డ్రాఫ్ట్‌ తయారు చేసి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి పంపామని… అక్కడ ఆమోదం లభించిన వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. ముందుగా మూడు మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని.. ఆ తర్వాత ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇకపై రేషన్‌ కార్డు దారులకు రెండు ఆప్షన్లు ఉంటాయి. బియ్యం కావాలంటేనే తీసుకోవచ్చు. ఒకవేళ వద్దంటే ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులను తిరిగి ఇస్తారు.