టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సాగునీటి పోరు బాట యాత్రకి అద్బుతమైన స్పందన వస్తుందన్నారు ఆ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం నియోజకవర్గంలో పులివెందల ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరధం పట్టారని అన్నారు.
చిత్తూరు జిల్లాలో అంగళ్లులో చంద్రబాబు రోడ్డు షో లేదని.. ఉదయం నుండి తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రణాళికాబద్దంగా దాడి చేసేందుకు పథకం రచించారని ఆరోపించారు. ద్వారకానాధ్ రెడ్డి చంద్రబాబుపై దాడి చేయించాడన్నారు బోండా ఉమా. ఉదయం కర్రలు, రాళ్ళు పట్టుకుని తిరుగుతుంటే పోలీసులు ఎందుకు నియంత్రించలేక పోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ వాళ్ళు టీడీపీ నేతలను కొట్టి తిరిగి టీడీపీ వాళ్ళ పైనే కేసు పెట్టడం దారుణం చర్య అన్నారు. డీజీపీ, డీఐజీ స్ధాయిలో అధికారులు ప్రభుత్వానికి అమ్ముడు పోయారని సంచలన ఆరోపణలు చేశారు. కొంత మంది పోలీసు అధికారులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏం చెబితే అది చేస్తున్నారు.. ఇది సిగ్గు చేటని విమర్శించారు. ఏపీ పోలీసులు గుడ్డిగా నిద్ర పోతున్నారని అన్నారు. టీడీపీ నేతలను కొట్టి.. టీడీపీ నాయకుల పైనే ఏడు FIRలు కట్టారన్నారు.