ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్. రైల్వే స్టేషన్లకు మహర్ధశ రానుంది. అమృత్ భారత్ స్టేషన్ల కింద, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం తో పాటు 72 స్టేషన్లను రైల్వేశాఖ అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో, రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి అమృత భారత స్టేషన్స్ పథకాన్ని ప్రకటించింది.
ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రైల్వే స్టేషన్లను ఎంపికచేసి, వాటి రూపురేఖలను మార్చే ప్రక్రియ చేపట్టింది. ఈ 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి మాస్టర్ ప్లాన్లను రూపొందించడానికి, నిపుణుల కమిటీలను నియమిస్తామని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్లను రూపొందించిన తర్వాత, దశలవారీగా పనులు చేపడతామని స్పష్టం చేశారు.