ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌పై బాబుకు ఆశ‌లు పోయాయా..?

రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని అనుకున్న టీడీపీకి రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు స‌వాలుగా మారుతున్నాయి. ఈ రెండు చోట్లా నాయ‌కులు లేరా? అంటే ఉన్నారు. కానీ, స‌రైన విధానంలో న‌డిపించే నేతలే లేక‌పోవ‌డంతో రానురాను పార్టీకి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు దూర‌మ‌వుతున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. విజ‌య‌వాడలో టీడీపీకి గ‌ట్టి ప‌ట్టుంది. ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం స‌హా వ్యాపార‌, వాణిజ్య వ‌ర్గాలు కూడా టీడీపీకి జై కొడుతున్నాయి. గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీ భారీ ఎత్తున ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీకి మంచి దూకుడు వ‌చ్చింది. తూర్పులో గ‌ద్దె రామ్మోహ‌న్ విజ‌యం సాధించారు.

సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ కేవ‌లం పాతిక ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. అంటే.. ఇక్క‌డ బ‌లం బాగానే ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం.. ప‌శ్చిమ‌లో మాత్రం టీడీపీ ప‌రిస్థితి ప్ర‌శ్నార్థంకా ఉంది. ఇక్క‌డ 1983లో బీఎస్ జ‌య‌రాజ్ విజ‌యంత‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది లేదు. పోనీ… స‌మీప భ‌విష్య‌త్తులో అయినా.. పార్టీ విజ‌యం సాధించే ప‌రిస్థితి ఉందా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో నేత‌లు ఇక్క‌డ డీలా ప‌డుతున్నారు. నిజానికి విజ‌య‌వాడ పార్టీ లో కీల‌క‌మైన నేత‌లు ఉండేది ఇక్క‌డే అయిన‌ప్ప‌టికీ.. పార్టీ దూకుడు చూపించ‌లేక పోవ‌డం శాపంగా మారింది.

ఇటీవ‌ల ప్ర‌క‌టించిన పార్టీ ప‌ద‌వుల్లో ఇక్క‌డి వారికి ప్రాధాన్యం ద‌క్క‌లేదు. దీంతో పార్టీని న‌డిపించే నేతలు క‌నిపించ‌డం లేదు. ఇక‌, మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోని చంద్ర‌గిరి. ఇక్క‌డ పార్టీ 1983, 1985, 1994 ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యం సాధించిన ప‌రిస్థితి లేదు. ఇప్ప‌టికీ ఇక్క‌డ పార్టీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వైసీపీ దూకుడు ముందు.. టీడీపీ శ్రేణులు డీలా ప‌డుతున్నాయి. కాంగ్రెస్ నుంచి టీడ‌పీలోకి వ‌చ్చిన మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌కే ఇక్క‌డిబాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై స్థానిక నేత‌లు గుస్సాగా ఉన్నారు.

అయితే, ఆమె త‌నంత‌ట తానుగా త‌ప్పుకొన్నాక కూడా పార్టీలో ఐక్య‌త క‌నిపించ‌డం లేదు. ఇక‌,  ఇటీవ‌ల పార్టీ త‌ర‌ఫున ప‌ద‌వులు ఇక్క‌డివారికి ల‌భించాయి. అయినా కూడా వారిలో ఎక్క‌డో నైరాశ్యం వెంటాడుతూనే ఉంది.  దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనూ స‌మీప భవిష్య‌త్తులో పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. మొత్తంగా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీని న‌డిపించేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.