టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఓ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై సభలు నిర్వహించడం సరైనది కాదన్నారు సజ్జల. పోలీస్ ఆక్ట్ కు లోబడే జీవో 1 తీసుకువచ్చామని తెలిపారు. ఈ నిర్ణయం అన్ని పార్టీలకు వర్తిస్తుందన్నారు సజ్జల.
ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రల బయలుదేరారని విమర్శించారు. సభల్లో అమాయకుల ప్రాణాలు పోవడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. నిబంధనలు పాటించి ఉంటే అమాయకుల ప్రాణాలు బలయ్యేవి కావన్నారు. చంద్రబాబుకు కనీస సంస్కారం లేదన్నారు సజ్జల. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు ఆలోచించాలని సూచించారు.