అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముందుటెల్ల కొదువకాదు
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ
రాజకీయంలో తగ్గి ఉండడం వేరు..తగ్గి మాట్లాడడం వేరు..హెచ్చులకు పోయి మాట్లాడి అధికారం ఉందన్న దర్పంతో మాట్లాడడం అన్నది ఇంకా పెద్ద తప్పు.ఆ తప్పు అటు ఆంధ్రా నాయకులు కానీ ఇటు తెలంగాణ నాయకులు కానీ చేయకూడదు.చేయొద్దు కూడా! ఎందుకంటే ఆ తరహాలో చేసే ఏ ఒక్క తప్పు అయినా దిద్దుకోవడం కష్టం.అంతేకాదు వాటి నుంచి బయటపడడం, సంజాయిషీ చెప్పుకోవడం కూడా ఏమంత అంగీకారంలో ఉండే విషయం కాదు.కనుక నేతలారా! నోరు జాగ్రత్త! అనువుగాని చోట అధికులమనరాదు అని గుర్తు పెట్టుకోండి చాలు.
ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నేతల అతి కారణంగానే అధినాయకత్వాలకు తలనొప్పులు.ముఖ్యంగాతెలంగాణ రాజకీయాల్లో అయితే కొందరు అదే పనిగా కేసీఆర్ ను పొగుడుతూ, ఇదేసమయంలో స్వామి భక్తి ప్రదర్శిస్తూ లబ్ధి పొందిన వారెందరో ! ఇదే సమయంలో ఆంధ్రాలో కూడా! కాస్త వివాదాలు ఉంటే చాలు అధినాయకత్వాలు కూడా వారినే ప్రోత్సహిస్తున్నాయి.తరువాత కాలంలోవాళ్లు నెగ్గుకు వస్తారో లేదో అన్నది తరువాత సంగతి ముందు ఇప్పుడు పార్టీ తరఫున వాయిస్ వినిపించాల్సిందే అన్న విధంగానే అధినాయకత్వాలూ ఉన్నాయి.
గతంలో కూడా చాలామంది నోటి దురుసు మంత్రులు ఇలానే పరువు పోగొట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో అన్నీ తామై నడిపిన నాయకులు ఇవాళ ఎక్కడా లేరు. అస్సలు వాళ్లు ఉన్నారో లేరో కూడా తెలియదు. అదేవిధంగా దానం నాగేందర్, శ్రీనివాస్ గౌడ్ లాంటి నాయకులు కూడా రేపటి వేళ కనిపించకుండా పోరని ఏంటి గ్యారంటి? కనుక నోరుంది కదా అని మాట్లాడకూడదు.
ఇక ఆంధ్రా పరిణామాల్లో అంతా బొత్సే ఉండి ఉంటారు.ఆయన మాటే పెద్ద గీతలా కనిపిస్తుంటుంది.పైకి అలా కనిపించినా జగన్ చెప్పకుండానే ఆయన ఆ విధంగా మాట్లాడతారా అన్న డౌట్ కూడా ఉంది.ఆంధ్రుల రాజధాని అమరావతి పేరిట ఎన్నో కీలక వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచారు.రైతులను ఉద్దేశించి హేళనగా మాట్లాడారు.అమరావతిని ఉద్దేశించి కూడా అదేవిధంగా మాట్లాడారు. ఇప్పుడు హై కోర్టు తీర్పు వేరుగా ఉంది. దీంతో మళ్లీ డైలామాలో పడిపోయారు బొత్స.రాజధాని పై వచ్చిన తీర్పుపై మంత్రులు ఇప్పటికైనా తగ్గి మాట్లాడితే బెటర్ లేదంటే మళ్లీ మళ్లీ రానున్న కాలంలో ఓటములు తప్పవు. ఆ విధంగా టీడీపీకి పట్టిన గతే వీళ్లకూ పట్టడం ఖాయం.