ఏపీ భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా వరద పోటెత్తుతుండటంతో రాష్ట్రంలోని నీటిప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
తాజాగా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరడంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో దేవీపట్నం మండలం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉదృతంగా గోదావరి నీటిమట్టం పెరిగిపోతోంది. దీంతో గండి పోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీటమునిగింది.
మరోవైపు వరద ఉద్ధృతితో జాతీయ రహదారి 326 కోతకు గురవ్వడంతో ఒడిశా-ఆంధ్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కల్లేరు, కుయిగూరు మధ్య జాతీయ రహదారిపై 4 కిలోమీటర్ల మేర వరద నీరు చేరింది. కూనవరం వద్ద గోదావరి, శబరి నదుల సంగమంతో వరద ఉద్ధృతి పెరిగింది. నదుల ఉద్ధృతితో కూనవరం మండలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదల వల్ల కూనవరం-భద్రాచలం, భద్రాచలం-చింతూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.