సీపీఎస్ పై స్ప‌ష్ట‌త ఇలా పొందండి జ‌గ‌న్ ?

-

కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్) రద్దు ఒక్కటే ఏకైక మార్గం. గ్యారంటీ పెన్ష‌న్ స్కీం (జీపీఎస్‌) ప్రత్యామ్నాయ పద్ధతులు ఆమోదయోగ్యం కావు..అని అంటోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ గెజిటెడ్ ఆఫీస‌ర్ల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ (ఏపీ జీఓ జేఏసీ). ఈ మేర‌కు ఆ సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు కేవీ కృష్ణ‌య్య స్పందించారు. ఆయ‌నేమంటున్నారంటే..పెన్షన్ – ఇదొక సామాజిక భద్రతాంశం.ఎన్నో ప్రాథమిక హక్కులతో పాటు, సున్నితమైన మానవ హక్కులు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి.

కేవలం ఓ ఐదు సంవత్సరాలు MLA / MP అయితే జీవితకాల పెన్షన్. దాదాపు జీవిత కాలం ప్రభుత్వ సేవ చేసే వారికి మాత్రం పెన్షన్ లేదు. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. ఆవు పాలు ఇచ్చినన్నీ రోజులూ పాలు పిండుకుని, వట్టి పోయిన తర్వాత అదే ఆవును కబేళాలకు తరలించడం ఎలాంటిదో – జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలమంతా ఉద్యోగుల సేవలను ఉపయోగించుకొని జీవిత చరమాంకంలో వారి సంక్షేమాన్ని గాలికి వదిలేయడం కూడా సరిగ్గా అలాంటిదే.! పెన్షన్ నిరాకరణ అనేది సామాజిక భద్రతా ప్రమాణాల, మానవ హక్కుల ఉల్లంఘనే కాకుండా రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కూడా అవుతుంది.

సాక్షాత్తు జాతీయ మానవ హక్కుల కమిషన్,నేషనల్ జ్యుడీషియల్ కమిషన్, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, ఎన్నో పెన్షన్ అధ్యయన కమిటీలు ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడాన్ని చాలా గట్టిగా సమర్థించాయి. GPS (గ్యారెంటీ పెన్షన్ స్కీం) కొత్త విషయం ఏమీ కాదు. PF RDA (ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ) – ఈ GPS మీద తన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఎంతోమంది మేధావులు చర్చోప చర్చలు చేసిన తర్వాత ఈ విధానాన్ని వ్యతిరేకించారు.

పాత సీసాలో కొత్త సారా లాగా ఉద్యోగుల పెన్షన్ కు సంబంధించి ఏదో అసంబద్ధమైన విషయం. పనిచేసేది రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో…ప్రతినెలా జీతమిచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ జీతాలు, పెన్ష‌న్ల పై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. కాబట్టి CPS రద్దుకు రాష్ట్రం పంపే ప్రతిపాదనలు కేంద్రం ఆమోదించాల్సిందే.

CPS రద్దు చేయడం రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక భారం కాదు. సంవత్సరానికి మ్యాచింగ్ గ్రాంట్ గా దాదాపు 2,500 కోట్లు ఖర్చు. జూన్ – 30, 2020 నాటికి AP CPS ఉద్యోగుల NPS అమౌంట్ – 12,262 కోట్లు..ఈ అమౌంట్ ను PF అకౌంట్ లకు మళ్ళించి రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వవచ్చు. 2022 ఏప్రిల్ నాటికి ఆ అమౌంట్ దాదాపు 15,000 కోట్లు పైగానే ఉంటుంది. సంవత్సరానికి 2,500 కోట్లు మిగులు. అదనంగా 12,262 నుండి 15,000 కోట్లు PF అకౌంట్ లకు మళ్లింపు. ఇది పూర్తిగా ప్రభుత్వానికి ఎంతో ఆర్థిక వెసులుబాటు కల్పిస్తోంది. CPS కంట్రిబ్యూషన్ ఆపివేస్తే ప్రతి ఉద్యోగికి సుమారు రెండు నుండి పది వేల వరకు జీతం పెరిగే అవకాశం ఉన్నది. సీపీఎస్ రద్దుకు సంబంధించి దాని అధ్యయనం గురించి వేసిన టక్కర్ కమిటీ ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ ఈ GPS అంశాన్ని కూడా ప్రస్తావించింది. వాటన్నిటినీ నిర్ద్వంద్వంగా ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. CPS రద్దు మాత్రమే ఏకైక మార్గం.GPS లాంటి ప్రత్యామ్నాయ విధానాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు.

– ఏపీ.గెజిటెడ్ అధికారుల జేఏసీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version