అమరావతి : ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలని.. వెంటపడి మరీ పనులు చేయించుకోవాలని ఆదేశించారు.
ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 7,962 మందిని తరలించామన్న అధికారులు.. 3, 228 మంది ఓటీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన 9756 మందిని తరలించాలని తెలిపారు. పోలవరం నిర్వాసితులందరికీ… అతి త్వరగా పునరావాసం కల్పించాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు.
డీబీటీ పద్ధతుల్లో ఆర్ అండ్ ఆర్ కింద ప్యాకేజీలు చెల్లించాలన్న సీఎం జగన్.. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని ఆదేశించారు. వెలగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించడానికి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలన్న సీఎం… మెయిన్ కెనాల్‌ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలని పేర్కొన్నారు.