వాలంటీర్ వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి లేఖ రాశారు మాజీమంత్రి హరిరామ జోగయ్య. వాలంటీర్ల సమస్యని ప్రస్తావిస్తూ.. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు రెండున్నర లక్షల మంది నెలకు 5000 చాలీచాలని జీతాలతో బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థలో అధిక శాతం వైసీపీ వారే ఉన్నారనేది వాస్తవమని లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య. వాలంటీర్ వ్యవస్థలో వైసీపీ వారే ఎక్కువగా ఉండటం వల్లే ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థని ఉపసంహరించుకోవాలని జీవో ఇవ్వడం జరిగిందన్నారు.
సంక్షేమ పథకాల అమలు కోసం కంటే అధికార పార్టీ తన ప్రయోజనాల కోసమే వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటుందని ఆరోపించారు. అవసరమైతే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలన్న పవన్ కళ్యాణ్ సంకల్పం మంచిదేనని సమర్థించారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న రెండున్నర లక్షల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అలాగే వారికి పదివేల రూపాయల కనీస వేతనం కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. ఇక రాజకీయ పార్టీలకు చెందిన వారిని వాలంటీర్లుగా నియమించకూడదని డిమాండ్ చేశారు.