గుంటూరు: సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు – నేడు పేరుతో పాఠశాలల అభివృద్ధి చేస్తే అడ్మిషన్లు ఎందుకు తగ్గుతున్నాయని ప్రశ్నించారు. లక్ష 30 వేల మంది ఇంటర్ విద్యను చదువుతుంటే ప్రభుత్వం పుస్తకాలు ఎందుకు అందించడం లేదని నిలదీశారు. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించకపోవడం సిగ్గుచేటని అన్నారు రాజేంద్రప్రసాద్.
పిల్లల విద్యను నాశనం చేస్తూ జగన్ రాజకీయ లబ్ధి పొందుతున్నాడని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం భయంతో పిల్లలు విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. నాడు – నేడు పేరుతో సీఎం జగన్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పది లక్షల రూపాయల ఆదాయం ఉంటేనే జగనన్న విదేశీ విద్య వర్తిస్తుందని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేని ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదన్నారు.