మూడో విడత జగనన్న తోడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపటి క్రితమే ప్రారంభించారు. జగనన్న తోడు మూడో విడత కింద 5,10,462 మందికి మంచి చేస్తూ రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని సందర్భంగా సీఎం జగన్ ప్రకటన చేశారు. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని… వీరితో కలుపుకుంటే 14.16 లక్షల మందికి మేలు చేయగలిగామని వెల్లడించారు. నామ మాత్రపు లాభాలకు చక్కటి సేవలను చిరు వ్యాపారులు అందిస్తున్నారని.. వారు చేస్తున్నది వ్యాపారం అనేకన్నా… గొప్ప సేవ అని చెప్పుకోవచ్చని తెలిపారు.
మన ఇంటి సమీపంలోకే అమ్మకాలు చేసుకుంటున్నారని.. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధిని పొందుతున్నారని వెల్లడించారు. వీరు మాత్రమే కాకుండా వీళ్ల ద్వారా ఇంకా అనేక మందికి మేలు కూడా జరుగుతోందని.. ఇలాంటి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి జీవితాలను నా పాదయాత్రలో స్వయంగా చూశానని తెలిపారు. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో లేకపోవడం వల్ల గ్యారెంటీలు కూడా ఇప్పించుకునే పరిస్థితి లేక అప్పు పుట్టక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయని… వీరికి ఇప్పించడమే కాకుండా, ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి, వడ్డీ భారాన్ని భరిస్తూ ఈపథకాన్ని ముందుకు తీసుకు వచ్చామన్నారు. ఇవాళ రూ.510.46 కోట్ల రుణాలు ఇవ్వడమే కాకుండా, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్నామన్నారు.
మొత్తంగా ఇవాళ రూ.526.62 కోట్లను ఇస్తున్నామని.. గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. చేతివృత్తుల మీద, హస్తకళలమీద బ్రతుకుతున్నవారికి కూడా జగనన్నతోడు వర్తిస్తోందని… ఎవరికైనా రాకపోయినా కంగారుపడాల్సిన అవసరంలేదన్నారు. వాలంటీర్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని.. లేదా వెబ్‌సైట్‌లో కూడా చేసుకోవచ్చని వెల్లడించారు. చిరు వ్యాపారులకు స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వటం జరిగిందని.. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుందన్నారు. బ్యాంకు ఖాతా తెరిచిన నాటి నుంచి… రుణం మంజూరు అయ్యేంతవరకూ అండగా ఉంటారని… సందేహాలు ఉంటే.. 08912890525కు కాల్‌చేయొచ్చని స్పష్టం చేశారు.