ఏపీ అధికార పార్టీలో మంత్రి కొడాలి నాని ఫైర్ బ్రాండ్‌గా మారిపోతున్నారు. రోజు రోజుకీ అగ్రెసీవ్‌గా మాట్లాడుతూ ప్రత్యర్థులపై బాణాల్లాంటి మాటలతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఏపీ పౌరసనఫరాల శాఖ మంత్రిగా వున్న కొడాలి నాని దేశ ప్రధాని నరేంద్ర మోదీపై, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌పై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇదే పెద్ద వివాదం అంటే హిందూ దేవుళ్లపై తాజాగా నాని చేసిన వ్యాఖ్యలు దీనికి మించిన వివాదాన్ని రేపుతున్నాయి.
కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో భగ్గుమన్న బీజేపీ వర్గాలు ఏపీలో రచ్చ చేయడం మొదలైంది. కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ముందు బీజేపీ శ్రేణులు నిరసన తెలపడం వారిని పోలీసులు వర్గాలు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌లకు తరలించడం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. దేశ ప్రధాని మోదీతో పాటు ఉత్తర ప్రదేశ్ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని భాజపా వర్గాలు డిమాండ్ చేశాయి. హనుమాన్‌పై నాని చేసిన వ్యాఖ్యలపై సంపూర్ణానంద స్వామి ఫైర్ కావడం సంచలనంగా మారింది.
అయితే నాని కారణంగా రాష్ట్రం రావణ కాష్టంలా మారే అవకాశం వుందని పలువురు రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు నాని దేవుళ్లపై కూడా వ్యాఖ్యలు చేయడంతో ఆయన బీజేపీ వర్గాలకు అడ్డంగా దొరికి పోయారని, ఏపీలో బీజేపీకి ఆయనో సంజీవనిలా మారుతున్నారని, ఇలాంటి వ్యక్తి అధికార వైసీపీకి ప్లస్ కావడం కంటే అత్యధిక శాతం మైనస్‌గా మారే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.