సీఎం జగన్‌కు ఆనాడే చెప్పా తగ్గేదే లేదని అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు, వైసీపీ నాయకుల పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని తెలిపారు. తాము ప్రజాధనాన్ని లూటీ చేయలేదన్న ఆయన, మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదని, పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తులం కాదని స్పష్టం చేశారు. పుట్టపర్తిలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన ప్రసంగించారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ బలం కార్యకర్తలేనని, నాయకులు పార్టీ మారి వెళ్లినా అండగా నిలబడేది కార్యకర్తలేనని తెలిపారు. గతంలో చంద్రబాబును అరెస్టు చేస్తే మొదట ఫోన్ చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఆయన ఒక అన్నగా నిలబడతానని తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆరోజు పవన్ విమానంలో రావాలంటే అనుమతి ఇవ్వలేదన్న లోకేశ్.. రోడ్డు మార్గంలో అడ్డుకున్నారని, అందుకే టీడీపీతో కలిసి వైసీపీని ఓడించాలని ఆయన నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు.