పార్లమెంట్ లో మణిపూర్ అల్లర్లకు సంబంధించిన అంశంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో వైసీపీ తరఫున అవిశ్వాసం పై చర్చలో పాల్గొన్నారు ఎంపీ మిథున్ రెడ్డి, మార్గాని భరత్. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. మణిపూర్ హింస చాలా బాధాకరమని అన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
అన్ని పార్టీలు కలిసి మణిపూర్ లో శాంతిస్థాపనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ సేవలు నియంత్రణ బిల్లు ఆమోదం పొందేందుకు వైసీపీ సహకరించాలని నిర్ణయించింది. దీంతో రాజ్యసభలో సంఖ్యాబలం లేని ఎన్డీఏ.. వైసీపీ ఎంపీల మద్దతుతో వివాదాస్పద ఢిల్లీ బిల్లుకు సులభంగా ఆమోదం పొందనుంది.