భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని పార్లమెంటులో ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి గారితో సహా ప్రధానమంత్రి ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు తాను కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. వైకాపా కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి మంత్రి మేరుగ నాగార్జున గారితో పాటు మరికొందరు నివాళులు అర్పించినట్లుగా సాక్షి దినపత్రికలో రాశారని పేర్కొన్నారు.
అంబేద్కర్ గారికి నిజమైన వారసుడు జగన్ మోహన్ రెడ్డి గారేనని నాగార్జున గారు కితాబునివ్వగా, జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ కూడా అంబేద్కర్ గారికి నివాళులర్పించినట్లుగా సాక్షి దినపత్రికలో వార్త కనిపించలేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు బహుశా మనసులో నివాళులు అర్పించినా సాక్షి దినపత్రికలో వార్త రాసి ఉండేవారని ఎద్దేవా చేశారు. 120 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు చివరకు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించేందుకు కూడా సమయం చిక్కకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఫామ్హౌస్ కే పరిమితమైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రజలు ఫామ్ హౌస్ కే పరిమితం చేశారని, ప్యాలెస్ లో ఉంటూ ప్రజలకు కనిపించని ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రజలు ప్యాలెస్ కే పరిమితం చేస్తారన్నారు. ఇటువంటి తప్పులు పునరావృత్తం చేయకుండా అంబేద్కర్ గారి వంటి మహానియుడికి నివాళులు అర్పించేందుకు అయినా ప్యాలెస్ నుంచి కాలు బయట పెట్టాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.