రానున్న ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. సర్వే నివేదికలన్నీ పార్టీకి ప్రతికూలంగా వస్తుంటే, అభ్యర్థులు దొరకక… పార్టీ నేతల కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ గారి సతీమణికి, మేనల్లుడికి లోక్ సభ టికెట్ కేటాయించగా, బొత్స గారి అన్నయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని, బొత్స గారి తమ్ముడికి ప్రస్తుతం సర్జరీ జరిగిందని, ఆయనకు కూడా ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారేమో తెలియదని అన్నారు.
ప్రజాసేవలో డాక్టరేట్ అందుకున్న మంత్రి నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యే టికెట్, ఆయన కొడుకుకి పక్క నియోజకవర్గంలో ఎంపీ టికెట్ కేటాయించారని ఎద్దేవా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి గారి ఇంట్లో నలుగురికి టికెట్లు ఖరారు చేసినట్లు తెలిసిందని, కడప నుంచి జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఒకరు ఎంపీగా పోటీ చేయనున్నారని, వై వి సుబ్బారెడ్డి గారికి రాజ్యసభ, ఆయన కొడుకుకి లోక్ సభ టికెట్ ఇస్తారని తెలుస్తోందని అన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో బాగుపడిన కుటుంబాలనే ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందన్నారు.