బాబు భక్తుల కష్టాలను రెట్టింపు చేస్తున్న వీర్రాజు ?

-

రాజకీయాలను తనకు నచ్చిన విధంగా మార్చుకుని, ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తనదే పై చేయి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు టిడిపి అధినేత చంద్రబాబు. రాబోయే ఆపదను సైతం ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగానే చాలా వ్యూహాత్మకంగా ప్రణాళికను రచించుకుని అన్ని విషయాల్లోనూ తన పెత్తనం చెల్లుబాటు అయ్యే విధంగా చేసుకుంటూ, రాజకీయ చదరంగంలో ఎప్పుడూ తనదే పైచేయిగా ఉండేలా చేసుకుంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల సమయం బీజేపీతో పొత్తు పెట్టుకుని బాబు బాగా లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన వైఖరిలో మార్పు స్పష్టంగా కనబడింది. బిజెపి అవసరం తనకు అక్కరలేదు అన్నట్లుగా వ్యవహరించి, ఆ పార్టీతో పొత్తు రద్దు చేసుకున్నారు.


ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో, మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు . దీనిలో భాగంగానే, తమ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఎంపిక అయిన సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటివారితో పాటు టీజీ వెంకటేష్ ను సైతం బిజెపిలోకి బాబు పంపించినట్లు గా టాక్ నడిచింది. ఇక బాబుకు అత్యంత సన్నిహితులైన సీఎం రమేష్ వంటి వారు బిజెపిలో ఉన్న బాబు జపం చేస్తూ, బిజెపిలో కీలకంగా తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు బాబుకు చేర వేస్తున్నారని, గుసగుసలు వినిపించాయి. అలాగే బిజెపి తరఫున తాము మాట్లాడుతున్నాము అన్నట్టుగా ఏపీకి సంబంధించిన అన్ని వ్యవహారాలపైనా స్పందిస్తూ, హడావుడి చేసుకుంటూ హడావుడి చేసే వారు.

ముఖ్యంగా అమరావతి వ్యవహారంలో సుజనాచౌదరి గట్టిగానే గొంతు పెంచి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసే వారు. దీనికి అప్పట్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మద్దతు సైతం ఉండేది. అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా, బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు, టీడీపీ బ్యాచ్ గా పేరున్న అందరి భరతం పట్టే విధంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే, ఇతర పార్టీలకు మేలు చేసే వారిని గుర్తించి వారిని వరుసగా సస్పెండ్ చేస్తూ వస్తుండడంతో, సీఎం రమేష్ వంటి వారు సైలెంట్ అయిపోయారు. అమరావతి తో పాటు, అనేక విషయాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, నిత్యం మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే సుజనా, సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పూర్తిగా ఏపీ విషయాలు తనకు సంబంధం లేదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.

అలాగే 2019 ఎన్నికల తర్వాత సుజనా చౌదరితో పాటు, బిజెపిలో చేరిన లంకా దినకరన్ ను సైతం సోము వీర్రాజు సస్పెండ్ చేయడంతో, ఇప్పుడు బిజెపి లోని బాబు బ్యాచ్ కు ఆందోళన పెరిగిపోతోంది.అందుకే గత కొంతకాలంగా ఏపీకి సంబంధించిన విషయాలలో ఎవరు కలుగ చేసుకునేందుకు ఇష్టపడడం లేదు. అదీ కాకుండా, బిజెపి ఏపీ నేతలు ఎవరైనా ఏ పికి సంబంధించిన విషయాలపై మాట్లాడాలి అన్నా, విమర్శలు చేయాలన్నా, ముందుగా తన అనుమతి తీసుకోవాలంటూ సోము వీర్రాజు ఆదేశాలు జారీ చేయడంతో, ఎవరికి వారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడుపడని అంశాలుగా మారిపోయాయి.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news