నందమూరి తారక రామారావు లేని భారతీయ చలన చిత్ర పరిశ్రమను ఎవ్వరూ ఊహించలేరు. వెండితెర వేల్పుగా ఆయనది విశిష్ట స్థానం. రాజకీయరంగంలోనూ చెరగని ముద్ర వేసిన ఘనుడు. నటుడిగా, నాయకుడిగా ఆయన కీర్తి అజరామరం. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మేరునగధీరుడాయన. అలాంటి యుగపురుషుడి శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న శుభతరుణంలో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. అతిరథమహారథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రూ. 100 విలువైన ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ విశిష్ట కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరీ, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, మోహనకృష్ణ, పురంధేశ్వరీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సహా పలువురు టీడీపీ నాయకులు, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. అయితే ఎన్టీఆర్ కుటుంబం నుంచి దాదాపు అందరూ హాజరైనా, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. గతంలో జరిగిన పరిణామాల కారణంగానే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే పుకార్లు తెరపైకి వచ్చాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని, వట్టి కల్పితాలేనని తెలుస్తోంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందింది. అయితే ప్రస్తుతం తారక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఈ కార్యక్రమానికి రాలేకపోయినట్లు తెలిసింది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ‘దేవర’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఈ చిత్రంతోనే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా మూవీగా ‘దేవర’ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా తారక్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం.