ఆ ఎమ్మెల్యే పార్టీ నేతల పొట్ట కొడుతున్నాడా

-

పార్టీ అధికారంలో ఉంటే కేడర్‌లో జోష్‌ మరోలా ఉంటుంది. ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటే.. పనులు దక్కుతాయని.. నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని అనుకుంటారు. కానీ.. ఆ నియోజకవర్గంలో కేడర్‌కు ఆ ఛాన్స్‌ ఇవ్వడం లేదట ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ పై అధికార పార్టీలో హాట్‌ హాట్ చర్చ జరుగుతోందట. ఆయన వ్యవహార శైలి నచ్చక అదేపనిగా కేడర్‌ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడమే ఈ చర్చకు కారణమట.

బిల్డర్‌గా ఉన్న మధుసూదన్‌ 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన సామాజికవర్గం ఓటర్లు కనిగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో పార్టీ టికెట్‌ ఇచ్చింది. కానీ.. 2014లో ఓడిపోయారు మధసూదన్‌. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ గాలి.. అంతకుముందు ఓడిపోయారన్న సింపతి ఆయనకు కలిసి వచ్చింది. దాదాపు 30 వేల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ కేడర్‌తో కలిసి మెలిసి తిరిగారు ఎమ్మెల్యే ముధుసూదన్‌. భారీ మెజారిటీతో గెలిపించిన తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు. దీంతో కనిగిరిలో అసలేం జరుగుతుందా అని అంతా ఆరా తీస్తున్నారట.

ఎమ్మెల్యే మధుసూదన్‌పై కేడర్‌లో అసంతృప్తి పెరిగింది. ఆయనపై జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వరసగా ఫిర్యాదులు చేస్తున్నారట. ఈ ఫిర్యాదుల వెనక ఆసక్తికర అంశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనిగిరి నియోజకవర్గానికి ఏ పని వచ్చినా.. ఎమ్మెల్యేనే చేస్తున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా.. డెవలప్‌మెంట్‌ వర్క్స్ చేసి నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ఎదురు చూస్తోన్న కార్యకర్తలకు ఏ పనీ దక్కడం లేదట. స్వతహాగా బిల్డర్‌ అయిన మధుసూదన్‌.. వచ్చింది చిన్న పని అయినా.. పెద్ద పని అయినా ఎవరికీ ఇవ్వకుండా కంప్లీట్‌ చేస్తున్నారట. చివరకు కనిగిరిలో కాలనీలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కూడా ఆయన చేస్తున్నట్టు సమాచారం.

కొంత కాలం ఓపికపట్టి చూసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే మధుసూదన్‌ తీరు రుచించలేదట. పార్టీ జెండా మోసిన తమకు భుజాలు బరువెక్కడం తప్ప మిగిలింది ఏంటని నిలదీయడం మొదలుపెట్టారట. అదే విషయాన్ని మంత్రి బాలినేనికి చెప్పుకొని వాపోయారట కార్యకర్తలు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలియంది కాదు. కానీ.. ఆయనెందుకు ఇలా చేస్తున్నారో పార్టీ పెద్దలకు అర్థం కావడం లేదట. మంత్రి కానీ.. ఇతర పెద్దలు కానీ ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడే పరిస్థితి లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news