దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె వై.యస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వైకాపాకు ఉపద్రవంగా పరిణమించనుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. వైకాపాకు జనవరి నాలుగో తేదీ చీకటి రోజుగా మారనుందని, అదే రోజు షర్మిల గారు కాంగ్రెస్ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా వై.యస్. షర్మిల గారు మళ్లీ తిరిగి సొంత రాష్ట్రానికి రానున్నారని, తాను పుట్టింది ఆంధ్ర ప్రదేశ్ లోనే అయినప్పటికీ, తన మెట్టినిల్లు అయిన తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందేనని, ఇప్పుడు తన తండ్రిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరనున్నారని తెలిపారు. చిన్న మనస్పర్ధల వల్ల కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని భావించిన షర్మిల గారు, అన్నను నమ్ముకొని సపోర్టుగా పాదాలు అరిగేలా రెండు ఎన్నికల్లో తిరిగారని, చెల్లెలు కోసం అష్ట కష్టాలు అనుభవించిన అన్నల గురించి వచ్చిన సినిమాలను ఎన్నో చూశాం… కానీ అన్న కోసం అష్ట కష్టాలు పడిన చెల్లెలు గురించి వచ్చిన సినిమాలు చూడలేదని, కానీ ప్రత్యక్షంగా ఒక అన్న కోసం చెల్లి చేసిన త్యాగాలను చూశాం అని అన్నారు.