ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అన్నాచెల్లెల్ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత అన్నా చేల్లెల్లు అయినప్పటికీ ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. అటు బహిరంగ సభల్లో ఇటు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శల జల్లు కురిపించుకుంటున్నారు.
తాజాగా మరోసారి వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో నవ సందేహాలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే 28 పథకాలను ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారు. దళితులకు భూమి ఇచ్చే కార్యక్రమం ఎందుకు ఆగిందని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎందుకు దారి మళ్ళించారు? అని నిలదీశారు. డ్రైవర్ ని చంపిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్ధిస్తున్నారు అని ప్రశ్నించారు. స్టడీసర్కిల్ కి ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు.