ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ మ్యాన్ షో నడుస్తోంది….కేవలం జగన్ హవాలో ప్రతిపక్ష టిడిపి తుడిచిపెట్టుకుపోతుంది…సాధారణ ఎన్నికల దగ్గర నుంచి స్థానిక ఎన్నికల వరకు వైసీపీ అదిరిపోయే విజయాలని సాధించి…తమకు తిరుగులేదని నిరూపించుకుంది. సాధారణ ఎన్నికల్లో ఎలాగో భారీ విజయంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వన్ సైడ్‌గా విజయాలు సాధించింది. మధ్యలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచి అదరగొట్టింది.
ఇక తాజాగా ఎంపిసిటి, జెడ్పిటిసి ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి తమ విజయ యాత్రని పూర్తి చేసుకుంది. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతి జిల్లాలో తమ ఆధిక్యాన్ని వైసీపీ నిరూపించుకుంది. దీంతో వైసీపీ విజయం పరిపూర్ణం అయింది…మరి నాయకుల విజయం పరిపూర్ణమేనా అంటే…చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ విజయాలు కేవలం జగన్ హవాకు నిదర్శనమనే చెప్పాలి. ఇందులో కొంతమంది నాయకుల కష్టం కూడా ఉంది.
అలా అని పూర్తి స్థాయిలో నాయకులకు ఈ విజయాలు అంకితం కాదనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక ఎంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారు? అంటే చాలా తక్కువ మందే అని చెప్పొచ్చు. అలాగే అక్రమాలు చేయడంలో ఎంతమంది ముందున్నారు? అంటే ఆ విషయం వారిని అడిగితే బెటర్. నాయకులు సరిగ్గా చేయకపోయినా ప్రజలు వైసీపీకి ఎందుకు మద్ధతుగా నిలిచారంటే…దానికి కారణం జగనే.
సరే జనమంతా జగన్ మీద ప్రేమతో వైసీపీని గెలిపించారని చెప్పడానికి లేదు… ప్రేమతో వేశారా? భయంతో వేశారా? పథకాలు పోకూడదని వేశారా? ప్రతిపక్షాలకు వేస్తే ప్రయోజనం లేదని వేశారా? అంటే ప్రజలు వైసీపీని గెలిపించడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విజయమే పరిపూర్ణం అనుకుని, తమకు ఇంకా తిరుగులేదని వైసీపీ నేతలు విజయ గర్వాన్ని నెత్తికెక్కించుకుంటే..నెక్స్ట్ అదే ప్రజలు కిందకు తొక్కుతారు.