అన్నమయ్య గృహ సాధన సమితి చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ మద్దతు తెలిపారు. తిరుమల కొండపై ఉత్తరామాడ వీధ వరాహ స్వామి వెనుక ఉన్నటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు నివసించిన ఇంటిని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెంటనే పునఃనిర్మించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నేడు ఆలయ దర్శనానికి విచ్చేసిన మాజీ గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్‌ను చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అన్నమయ్య గృహసాధన సమితి చేపడుతున్న పోరాటం గురించి రాష్ట్ర కార్యదర్శి ఖదిజ్ఞాసి పంబాల రాజు మాజీ గవర్నర్‌కు వివరించి సంతకాలు చేయించారు.
ఈ సందర్భంగా ఖదిజ్ఞాసి పంబాల రాజు మాట్లాడుతూ.. అన్నమయ్య తెలుగులో 32 వేల సంకీర్తనలు రచించారు. తెలుగు భాషా సంస్కృతికి ఎనలేని సేవలు చేశారు. అలాంటి మహనీయుడి ఆనవాళ్లను టీటీడీ తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనికి వ్యతిరేకంగా అన్నమయ్య గృహ సాధన సమితి తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతోందని, ప్రజలు ఈ కార్యక్రమంలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య గృహసాధన సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మేశ్వర్ దున్న, ఖదిజ్ఞాసి లావణ్య గోవిందు, ఖదిజ్ఞాసి అరవింద్, ఖదిజ్ఞాసి లావణ్య గార్లపాటి, ఖదిజ్ఞాసి నైని తదితరులు పాల్గొన్నారు.