కేసీఆర్ కేబినోట్లోకి మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు… ఇదేం ట్విస్ట్‌…!

-

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పటికే రెండు సార్లు జరిగింది. ప్రస్తుతం కేబినేట్ లో ఉండాల్సిన మంత్రులంతా ఉన్నారు. ఇక ఇప్పట్లో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండదని కూడా అంతా అనుకున్నారు. కానీ కొత్త ఏడాదిలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగాది తర్వాత మరోసారి సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గంలో నలుగురు మంత్రుల పై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారని సమాచారం.

శాఖకు సంబంధించిన పనుల్లో కూడా ఆ మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. అదే విధంగా గ‌త మంత్రి వ‌ర్గంలో మ‌హిళ‌ల‌ను ఎవ్వ‌రిని మంత్రిగా తీసుకోలేదు. కానీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మొదటి విస్త‌ర‌ణ‌లో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. అయితే రెండోసారి జ‌రిగిన మంత్రివ‌ర్గంలో ఇద్దరు మహిళలను మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో స‌త్య‌వ‌తి రాథోడ్‌, స‌బితా ఇంద్రారెడ్డిల‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. అయితే స‌త్య‌వ‌తి రాథోడ్ టీడీపీ నుంచి, స‌బితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. అయితే తెరాస పార్టీ ప్రారంభం నుంచి ఉన్న తమను కాదని, నిన్న మొన్న వచ్చిన వారికి మంత్రి పదవి ఇవ్వడం పై పార్టీ సీనియర్ మహిళా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అందరికి అనుకూలంగా ఉండే విధంగా మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈసారి మరో ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం. దాంతో మొత్తం నలుగురు మహిళలు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్లని కూడా నూతన మంత్రి వర్గంలోకి తీసుకుంటారని టాక్. నూతన రాజ్యసభ సభ్యుల ఎన్నిక, ఎమ్మెల్సీల ఎన్నిక అనంతరం మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

వ‌చ్చే ఏడాది రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక ఉంటుంది. అయితే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్న త‌రుణంలో ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఎవ్వ‌రికి ఉద్వాస‌న ప‌లుకుతారో అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మంత్రుల్లో ప‌నితీరు బాగాలేని వారిని సీఎం కేసీఆర్ త‌ప్పించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మంత్రుల్లో టెన్ష‌న్ మొద‌లైంది.

Read more RELATED
Recommended to you

Latest news