మంత్రి బొత్స వరుస వివాదాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. తనకు నచ్చని శాఖ కట్టబెట్టి తన తలపై ముళ్ల కిరీటం ఉంచారు అని పదే పదే అంతర్మథనంలో ఉన్న బొత్సకు రానున్న పరిణామాలు సవాలుగానే ఉండనున్నాయి. ఎందుకంటే పది తరువాత ఇంటర్ పరీక్షల నిర్వహణ అన్నది చిన్న విషయం కాదు. వివాదాలకు తావు లేకుండా పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వెల్లడి వరకూ కృషి నిరంతరం చేస్తూనే ఉండాలి. అధికారులను మానిటరింగ్ చేయకుంటే పరీక్షల మాట దేవుడెరుగు ప్రభుత్వం పరువే ఏకంగా పోతుంది.
అందుకు బొత్స ఈ శాఖ అంటేనే హడలిపోతున్నారు. తానేం చెప్పిన చెల్లదని తేలిపోయాక కష్టమో, ఇష్టమో ఈ శాఖతోనే ఈ రెండేళ్లు అన్న వాస్తవిక దృక్పథానికి ఆయన వచ్చినా కూడా నిర్వహణ లోపాలు మాత్రం దిద్దలేకపోతున్నారు. అదే ఇప్పుడు విచారకరం. ఎన్నో ఏళ్ల కిందట రాష్ట్రాన్ని కదిపేసిన కుదిపేసిన ప్రశ్న పత్రాల లీక్ అన్నది మళ్లీ వెలుగు చూడడం ఓ వైపు, ఇంటర్ హాల్ టికెట్ జారీలో ముద్రణ లోపాలు వెలుగు చూడడం మరోవైపు బొత్స ను కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయమై ఇప్పటికే కొన్ని వివాదాలను చవిచూస్తున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. వాస్తవానికి ఇప్పటిదాకా మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకోలేదు. అయినప్పటికీ శాఖ పరమైన నిర్ణయాలు అయితే వెలువరిస్తున్నారు. మొన్నటి రోజున వరుస పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి వాట్సాప్ లో పలు సార్లు పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వీటిని వెంటనే ఖండించిన జగన్ ప్రశ్న పత్రాల లీకేజీపై ఓ క్లారిటీ అయితే ఇచ్చారు. అలానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. కానీ లీకులు మాత్రం ఆగలేదు. ఆఖరికి అవి లీకులు కాదు అక్కడ జరిగింది మాల్ ప్రాక్టీస్ అని చెప్పి అధికారులు తప్పుకున్నారు. అయినా కూడా మీడియా పలు వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. సంబంధిత వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేయడంతో గొడవ సర్దుమణిగింది. ప్రశ్న పత్రాల లీకేజీ వెనుక వైసీపీ నాయకుల హస్తమే ఉందని టీడీపీ ఆరోపణలు చేసినా అవేవీ బొత్స పట్టించుకోకపోవడం గమనార్హం. ఎల్లప్పుడూ తనదైన పంథాలో మాట్లాడి మీడియాను కన్ఫ్యూజ్ చేసే మంత్రి బొత్స ఎందుకనో విద్యాశాఖ నిర్వహణ విషయంలో చాలా తప్పిదాలు చేస్తున్నారు.
తాజాగా ఇంటర్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల జారీలో తప్పిదాలు జరిగాయి. వీటిని వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్ష వేళ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఉండగా, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అని ముద్రితం అయి వచ్చాయి. వెంటనే సంబంధిత Andhra Pradesh Centre for Financial Systems and Services (APCFSS) కు చెందిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కానీ ఇటువంటి తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించే బాధ్యత బొత్సదే !