మరో మెట్టు ఎక్కిన బండి..బీజేపీకి అడ్వాంటేజ్.!

-

తెలంగాణలో బీజేపీ బలం పెరగడంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృషి కూడా ఉందని చెప్పవచ్చు. అంతకముందు వరకు పనిచేసిన అధ్యక్షులు పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం చేయలేదు. ప్రజల్లో తిరగలేదు..ప్రజా సమస్యలపై గళం విప్పలేదు. కానీ బండి అధ్యక్షుడు అయ్యాక సీన్ మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో పోరాడుతూ వస్తున్నారు. ఎక్కడ కూడా పట్టు విడవకుండా పనిచేస్తున్నారు. అరెస్టులు చేస్తున్న వెనక్కి తగ్గలేదు.

ఇక పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉంటూ..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు విడతల్లో పాదయాత్ర చేశారు.  ఇప్పటివరకు మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఐదు విడతల్లో కలిపి 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఐదో విడత యాత్ర ముగింపుకు వచ్చింది. ముగింపు సభని కరీంనగర్‌లో భారీగా ప్లాన్ చేశారు. ఈ సభకు జేపీ నడ్డా అతిథిగా రానున్నారు.

అయితే విజయవంతంగా సాగుతున్న బండి పాదయాత్ర గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతున్న తీరుపై మోదీ ఆరా తీశారు. రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్‌ను తన వద్దకు పిలిచి ఈ విషయంపై అడిగి తెలుసుకున్నారు. సంజయ్‌ యాత్రకు ప్రజల్లో మంచి ప్రతిస్పందన లభిస్తోందని లక్ష్మణ్‌ చెప్పగా, గుడ్‌ అంటూ మోదీ ప్రశంసించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కూడా రోజురోజుకూ మెరుగు పడుతోందని లక్ష్మణ్ మోదీకి వివరించారు. ఇలా మోదీ సైతం ప్రత్యేకంగా బండి యాత్ర గురించి తెలుసుకున్నారు.

అలాగే పాదయాత్రపై ఓ నివేదిక కూడా ఇవ్వాలని, బండి పాదయాత్రని బీజేపీ పార్లమెంటరీ సమావేశంలొ చూపించి..ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ నేతలు ఇంకా దూకుడుగా ఎలా పనిచేయాలో సూచనలు చేయనున్నారని తెలిసింది. దీని బట్టి చూస్తే బండి యాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. పాదయాత్ర ద్వారా బండి రాజకీయాల్లో ఓ మెట్టు పైకి ఎక్కారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news