ఈనెల 14వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని అందులో పేర్కొన్నారు. తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
అయితే ఈ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ సారి 11 రోజులు మాత్రమే జరగనున్నాయి. ఈ నెల 14న ప్రారంభమయ్యే ఈ భేటీలు 29 వరకు జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మధ్యలో శని, ఆదివారాలు, ఉగాది సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో సభ జరగనుంది. 17వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టి, 18, 19 సెలవులు ప్రకటించనుంది. 25, 26 తేదీల్లో శని, ఆదివారాలు కాగా, 22న ఉగాది సందర్భంగా సెలవు రానుంది. 30న శ్రీరామనవమి సెలవు కావడంతో 29నే సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తేదీలను అధికారికంగా బిజినెస్ సలహా మండలి సమావేశంలో ఖరారు చేయాల్సి ఉంటుంది.