ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మార్పు జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేస్తారని…ఆయన స్థానంలో కోలగట్ల వీరభద్రస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.
అంతే కాదు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సోమవారం రాజ్భవన్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ను మరియు సభలో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించినట్లు సమాచారం అందుతోంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అలాగే ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన వివరాలతో పాటు ఇతర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే కోనసీమ లో జరిగిన ఆందోళనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం జగన్ గవర్నర్ కు వివరించారని తెలుస్తోంది.