చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడే నాయకులు మనకు అవసరమా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిషేధిత భూముల జాబితా నుంచి షరతు గల పట్టాభూముల తొలగింపు కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘వీధి రౌడీలు కూడా అలా మాట్లాడతారో లేదో నాకు తెలీదు. నాయకులుగా చెప్పుకొంటున్నవారు టీవీల్లో చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు నాయకులా? అని ఒక్కోసారి బాధగా ఉంటుంది. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేం మాట్లాడిస్తున్నారో అంతా చూస్తున్నాం. ఎవరికీ.. ఏ ప్రాంతానికీ అన్యాయం చేయకుండా మూడు రాజధానులతో అందరికీ మేలు జరుగుతుందని మనం చెబుతోంటే.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండని నాయకులుగా చెప్పుకొంటున్నవారు మాట్లాడుతున్నారు. వాళ్లు ఇలా మాట్లాడితే మహిళల పరిస్థితేంటి?దీనిపై ప్రజలంతా ఆలోచించాలి’’ అని సీఎం జగన్ అన్నారు.