విశాఖపట్టణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, రంగాలకు విశాఖ హబ్ కావాలని సీఎం అన్నారు. దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని, దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని, ఐటీకి చిరునామాగా మారుతుందని చెప్పారు.
విశాఖట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ ప్రభుత్వం మొత్తం 387 ఎంవోయూలు కుదుర్చుకుంది. వాణిజ్యం, ఇంధన, ఐటీ, టూరిజం, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించిన ఈ ఒప్పందాల విలువ రూ.13,12,120 కోట్లు అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే, వీటిలో ఎగుమతుల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రధానంగా చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులపై శ్రద్ధ చూపించాలని సీఎం జగన్ నేటి సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎంఎస్ఎంఈల కోసం వేటికవే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని, ప్రాధాన్యత ఆధారంగా వాటి పురోగతిపై పరిశీలిస్తుండాలని సూచించారు.