బోగస్ చలాన్ల కుంభకోణంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

అమరావతి : బోగస్ చలాన్ల కుంభకోణంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ తరహాలోనే మరి కొన్ని శాఖల్లోనూ అంతర్గత తనిఖీలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. చలానాల రూపంలో ప్రజలు చెల్లించే నగదు సీఎఫ్ఎంఎస్ కు చేరుతుందా..? లేదా అనే అంశం పై వివరాలు సేకరిస్తోన్న అధికారులు… ఎక్సైజ్, మైనింగ్, రవాణ, కార్మిక తదితర శాఖల్లో అంతర్గత తనిఖీలు చేపడుతోంది ఏపీ ప్రభుత్వం.

ప్రజలు చెల్లించే చలానాల నగదు సీఎఫ్ఎంఎస్ కు చేరేందుకు జాప్యం జరుగుతోందని గుర్తించారు అధికారులు. జాప్యం కావడం వల్లే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని అభిప్రాయపడుతోన్న అధికారులు…. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో అంతర్గత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ. 8.13 కోట్ల నిధులు గోల్ మాల్ అయినట్టు వెల్లడించారు అధికారులు. ఇందులో రూ. 4.62 కోట్ల మేర రికవరీ అయినట్లు అధికారులు తెలపగా… 14 మంది సబ్ రిజిస్ట్రార్ల మీద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.