ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుందని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు. ఈ నెల నాలుగో తేదీన కొత్త జిల్లాలు కొలువు తీరనున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, నగర మేయర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన జిల్లాల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయమన్నారు.
ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు పండుగలా నిర్వహించాలని… ప్రజల సెంటిమెంట్లు, డిమాండ్లు, చారిత్రక అంశాలను గౌరవిస్తూ నూతన జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆయన వెల్లడించారు. పాలనను గడప గడపకు తీసుకువెళ్ళిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ దని.. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ, నూతన జిల్లాల ఏర్పాటు గొప్ప సంస్కరణలు అని చెప్పారు. ఏపీ సీఎం వైయస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఈ వ్యవస్ధలు రూపు దిద్దుకున్నాయని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైయస్సార్ సీపీ ప్రభుత్వ పరిపాలన సాగుతోందని వెల్లడించారు.