ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు వారి పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తారా..? అంటూ ప్రశ్నించారు. లక్షల రూపాయలు వేతనంగా తీసుకుంటూ.. వారి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని మండిపడ్డారు. టీచర్లు పాఠాలు చెప్పే స్కూళ్లలో వారి పిల్లల్ని ఎందుకు చదివించడం లేదని ప్రశ్నించారు. మీరు 70 వేల నుంచి లక్ష రూపాలయు తీసుకుంటూ పాఠాలు చెబుతున్నారని అలాంటిది కేవలం 10 వేలు, 20 వేలు తీసుకుని పాఠాాలు చెబుతున్నవారి వద్ద మీ పిల్లల్ని వదులుతున్నారని నారాయణ స్వామి అన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవమైనదని.. ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగులు, ఉపాద్యాయులు సహకరించాలని కోరారు. ఇష్టారీతిగా మాట్లాడవద్దని సూచించారు.
శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు వారి కష్టాలను ప్రభుత్వానికి తెలియపరచండి… అంతే కానీ చర్చలకు పిలిచినా రామంటూ ఉద్యోగులు వ్యవహరించడం సరిగ్గా లేదని నారాయణ స్వామి అన్నారు. మా కోరికలు తీరిస్తేనే చర్చలకు వస్తామనడం ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించాలని ఆయన అన్నారు.