అరాంఘర్ – శంషాబాద్ రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి – సీఎస్ సోమేశ్

-

ఆరాంఘర్ చౌరస్తా – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గంలో రోడ్డు, అభివృద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆరాంఘర్ – శంషాబాద్ రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌లో ఆర్‌అండ్‌బి, ట్రాన్స్ కో, రెవెన్యూ, ఎండోమెంట్స్, వక్ఫ్ బోర్డు తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రూ. 283 కోట్ల వ్యయంతో 10 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రోడ్డు విస్తరణ, రెండు సర్వీస్ రోడ్లు, ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. వీటితోపాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, సాతంరాయి, ఎయిర్ పోర్ట్ ప్రవేశ మార్గాల వద్ద అండర్ పాస్ లు, గగన్ పహాడ్ వద్ద ఫ్లయ్ ఓవర్, శంషాబాద్ టౌన్ లో ఎలివేటెడ్ కారిడార్ ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణ పనుల వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.

రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్నవిషయాలపై ప్రజాప్రతినిధులతో సమావేశం వెంటనే నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ డిసెంబర్ మాసాంతంలోగా పనులను పూర్తి చేసేందుకు సమన్వయంతో కృషిచేయాలని సూచించారు. ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి పోలీసు శాఖ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పనుల పురోగతిపై తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తానని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version