టీనేజీ ప్రేమల సంగతి పక్కన పెడితే కౌమార దశ దాటిన తర్వాత కూడా ప్రేమలో పడ్డవారికి పెద్దగా పరిణతి ఉండకపోవడం బాధించే అంశం. ఎందుకంటే, టీనేజీ తర్వాతే అసలు జీవితం మొదలవుతుంది. 19దాటాక కూడా టినేజీ తాలూకు ఛాయలు మరో రెండు మూడేళ్ళ వరకు అలానే ఉంటాయి. అందరికీ ఉంటుందని కాదు కానీ కొద్ది మందిలో అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐతే ఇరవైల్లో ప్రేమలో పడేవాళ్ళు కొన్నివిషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.
మీ తొలిప్రేమ ఇరవైల్లోనే మొదలైతే గనక దానికి అత్యంత తీవ్రత ఉంటుంది. స్కూళ్ళలో క్రష్ సంగతి పక్కన పెడితే ప్రేమ గురించి సరిగ్గా ఆలోచించిన వయసు ఇరవై మొదట్లో ఉంటే గనక ఆ ప్రేమ తాలూకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఆనందాలూ ఎక్కువే. అనర్థాలూ ఎక్కువే. ఒకవేళ ఇలాంటి ప్రేమలో ఏదైనా చిన్న అపర్థాలు వస్తే గనక అప్పుడున్నంత నరకం ఇంకెప్పుడూ ఉండదు. ప్రేమను ఈజీగా వదులుకోలేరు కాబట్టి ఆ ప్రక్రియలో కాలిపోతూ ఉంటారు.
అటు ప్రేమ, ఇటు కెరియర్.. రెండూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. మీరు నిజంగా చదువులో తోపు అయ్యుండి అటు ప్రేమనీ, ఇటు కెరియర్ ని బ్యాలన్స్ చేసుకునే వాళ్ళయితే తప్ప మిగతా వారు ఈ చిక్కుముడిలో పడి దేన్నో ఒకదాన్ని లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్త.
ప్రేమించారు. విడిపోవాల్సి వచ్చింది. విడిపోయారు. అప్పుడు అంత ఈజీగా వేరే వాళ్ళపై ప్రేమ పుట్టదు. ఒకవేళ మీవైపు నుండి ప్రయత్నించినా అంతకుముందు ప్రేమ గుర్తొచ్చి అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. ఫలితం.. కొన్ని రోజులయ్యాక ప్రేమ రాహిత్యంతో బాధపడాల్సి వస్తుంది. మీకు నిజంగా ఇతర వ్యక్తిపై ప్రేమ కలిగితే ప్రేమించండి. కానీ దానికి ముందు చాలా ఎక్సర్ సైజ్ చేయండి.