మార్కెట్లో బోలెడు ఫోన్లు ఉన్నాయి.. మన దగ్గర ఉన్న బడ్టెట్లోనే స్మార్ట్ ఫోన్ తీసేయొచ్చు. అయితే మీరు ఆ ఫోన్ ఎంతకాలం వాడుతున్నారు. ఎందుకు ఫోన్ కొన్న సంవత్సరానికే బాగా పాడైపోతుంది.. స్లోగా ఎందుకు అయిపోతుంది..ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా..? దీనికి సమాధానం ఆ మనం కొనిందే తక్కువ ధర ఉన్న ఫోన్.. ఎంతకాలం వస్తుందిలే అనుకుంటాం.. కానీ దానికి కారణం.. మీరు ఛార్జింగ్ విషయంలో చేసే తప్పులు కూడా కావొచ్చు. అవేంటంటే..
కొందరు స్మార్ట్ ఫోన్‌లు ఫుల్ చార్జ్ చేస్తుంటారు. 99 శాతం అయినా సరే ఇంకో శాతం ఉంది కదా అని చార్జింగ్ పెడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల స్మార్ట్ ఫోన్ పనితీరు దెబ్బ తింటుంది. దీర్ఘ కాలంలో ఇది ఫోన్ ప్రాసెసర్‌పై ఎఫెక్ట్ అవుతుంది. బ్యాటరీ కూడా త్వరగా పాడవుతుంది.
ఇంకో రకం ఉంటారండీ.. బ్యాటరీ జీరో స్థాయికి వచ్చే వరకు ఫోన్ వాడుతూనే ఉంటారు. ఇది కూడా ఫోన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. చార్జింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా వాడుతూనే ఉండడం వల్ల ఫోన్ త్వరగా పాడవుతుందట.
C పిన్ రకం ఛార్జర్లు ఉపయోగించడం ద్వారా కూడా ఫోన్‌లు త్వరగా పాడవుతాయి. సాధారణంగా కంపెనీతో వచ్చిన చార్జర్‌ను మాత్రమే ఫోన్‌కు వాడాలి. కానీ ఒరిజినల్ చార్జర్ పాడైతే చాలా మంది మార్కెట్లో దొరికే నాసిరకం చార్జర్స్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల కూడా ఫోన్ పాడవుతుంది. అలాగే మన ఛార్జర్‌ను పదే పదే వేరే ఫోన్లకు వాడటం కూడా మంచిది కాదు..
వీళ్లు ఇంకా ముదురు.. ఫోన్ వాడటం అయిపోతే చాలు.. దాంట్లో ఎంతన్నా ఛార్జింగ్ ఉండనీ మాటిమాటికీ ఛార్జ్ చేస్తూనే ఉంటారు. 10 శాతం తగ్గినా సరే వెంటనే చార్జ్ చేస్తుంటారు. ఇలా చేయకూడదు కనీసం 20 శాతం వచ్చే వరకు చార్జింగ్ జోలికి వెళ్లకూడదు. పదే పదే చార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ కెపాసిటీ తగ్గి ఫోన్ త్వరగా పాడవుతుంది.
ఛార్జింగ్ విషయంలో మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తుంటే జర జాగ్రత్త..!