మీ అమ్మాయికి డబ్బు విలువ నేర్పిస్తున్నారా.? ఈ తేడా తెలిసేలా చేయండి..!

-

పిల్లలను పెంచే క్రమంలో.. వారికి విద్యాబుద్ధులు ఒక్కటే నేర్పిస్తే సరిపోదు.. ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా అవసరం. ముఖ్యంగా అమ్మాయిలకు చదువు ఎంతో ముఖ్యమో.. ఆర్థిక పరమైన విషయాలపై చిన్ననాటినుంచే అవగాహన కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు.

భారతదేశంలో చాలామంది మహిళలు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తమ భర్తపై ఆధారపడుతుంటారు. దానివల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. అందుకే నేటి తరం అమ్మాయిలు ఉద్యోగం రాకముందే.. సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని తీర్చిదిద్దడం తల్లిగా మీ బాధ్యతే.. దీనికోసం ఇంట్లో జరిగే ఆర్థిక చర్చల్లో వారిని భాగం చేయండి. ఫలితంగా వారికి ఆర్థిక ప్రణాళిక, పన్నులు, ఖర్చులు వంటి వివరాలపై అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి మీ అమ్మాయితో చర్చించడం చేస్తూ ఉండండి.. ఇలా చేయడం వల్ల స్నేహితులు, భవిష్యత్తులో భర్తతో కూడా ఆర్థిక విషయాలను స్వేచ్ఛగా, సాధికారికంగా మాట్లాడగలుగుతారు.

పిల్లల ఆనందం కంటే తల్లిదండ్రులకు మించిందేమి ఉండదు.. వారి అడిగినది కొనే స్తోమత ఉన్న ఏ పేరెంట్స్ కూడా వెనకా ముందు ఆలోచించచకుండా.. ఇచ్చేస్తుంటారు. దీనివల్ల పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పోతుంది. ఆ క్షణం దీని ప్రభావం ఏమంత కనిపించకపోయినా.. భవిష్యత్తులో వారు ఇదే ధోరణిలో ఉంటే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసేలా చేయాలంటున్నారు నిపుణులు.

దీనికోసం వారు చేయగలిగే కొన్ని పనులను వారితో చేయించంచడి.. సరిగా చేస్తే బహుమతిగా కొంత నగదు ఇవ్వండి. ఒకవేళ పనిలో నాణ్యత లేకపోతే తక్కువ డబ్బు ఇవ్వండి. దీనివల్ల డబ్బులు సులభంగా రావనే విషయం వారికి తెలిస్తుంది. ఫలితంగా వారు డబ్బుకు విలువివ్వడం మొదలుపెడతారు.

ఈ తేడా తప్పనిసరిగా చెప్పాలి..

ఆశకి, అవసరానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అది తెలిస్తే ఎవరైనా తమ ఖర్చులను అదుపులో పెట్టుకోగలుగుతారు. ఆశపడిందల్లా కొనకూడదు.. అవసరం ఉన్నంత వరకే ఖర్చుచేయాలి. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ఇదే విషయాన్ని చెప్పండి. ఇలా చేయడం వల్ల వారు చేసే ఖర్చును వారే అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం మీ అమ్మాయి ఏదైనా వస్తువు కొనమని అడిగితే అది తప్పనిసరిగా కావాలా? లేకపోయినా పర్లేదా? అని అడిగి నిర్ణయం తీసుకోండి. ఇదే పద్ధతిని మీ అమ్మాయికి క్రమంగా అలవాటు చేయండి. ఈ విధంగా ఆలోచించడం వల్ల వారు భవిష్యత్తులో బలమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవగలుగుతారు.

కొంతమంది అమ్మాయిలు ఉద్యోగం సంపాదించిన తర్వాత షాపింగ్‌ల పేరుతో విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇంకొంతమంది అమ్మాయిలు క్రెడిట్‌ కార్డులను ఇష్టం వచ్చినట్లు వాడేస్తుంటారు. ఇలాంటి అలవాట్లు అప్పుల ఊబిలోకి దించుతాయి. కాబట్టి, పొదుపు చేయడం వల్ల కలిగే లాభాలను అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే వివరించాలి.

ఇందుకోసం మీ పిల్లలకు ఒక పిగ్గీ బ్యాంకుని వారికి ఇవ్వండి. ఇందులో మీరు ఇచ్చిన డబ్బులు, వారికి బహుమతిగా వచ్చిన డబ్బులను దాచుకోమని చెప్పండి. అవి కొంత మొత్తం అయిన తర్వాత వారికి అవసరమైన మంచి వస్తువుని కొనివ్వండి. ఇలాంటి పద్ధతులు వారిలో పొదుపు చేయాలనే భావనను మరింత పెంచుతాయి.

ఈ విషయాలను పిల్లల చిన్నప్పటినుంచే తల్లిదండ్రులు అలవాటు చేస్తే.. వారికి భవిష్యత్తులో బాగా ఉపయోగడతాయంటున్నారు నిపుణులు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news