ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న క్రమంలో ఎంఐఎం ఛీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై దుండగులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పార్లమెంట్ లో కూడా తనపై జరిగిన దాడి గురించి అసదుద్దీన్ ప్రస్తావించారు. ఈ ఘటనతో అలెర్ట్ అయిన కేంద్రం అసదుద్దీన్ కు జెడ్ కేటగిరి భద్రతను కల్పించాలని భావించింది. అయితే తనకు జెడ్ కేటగిరి భద్రతను వద్దన్నారు అసద్. ఈ ఘటనపై సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయనున్నారు.
ఇదిలా ఉంటే తనపై జరిగిన దాడిపై దయచేసి సరైన విచారణ జరిపించాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను కోరారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. క్రికెట్ కేసులోనే మీరు ఎన్ ఎస్ ఏ ని ప్రయోగించారని.. మీరు ఈ విషయంలో కూడా న్యాయం చేయాలని కోరారు. ఇలా చేస్తే మీరు స్వతంత్రులని యూపీ ప్రజలకు తెలుస్తుందని అన్నారు. ఈ రాడికలైజేషన్ ప్రబలితే, అది ఉగ్రవాదం & మతతత్వంగా మార్చబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.