సూర్యాపేట లో నూతన ఆసరా ఫింఛన్లను పంపిణీ చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ సొంత రాష్ట్రంలో ఆసరా ఫించన్ 750 రూపాయలేనని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇచ్చేది కేవలం 600 రూపాయలేనన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణాలోనూ ఇచ్చింది 800 కోట్లే అన్నారు మంత్రి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 12,000 కోట్లు పెన్షన్లకి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
25 వేల కోట్ల ఋణమాఫీ చేసింది ఒక్క తెలంగాణాలోనేనని అన్నారు జగదీశ్ రెడ్డి. డబుల్ ఇంజిన్లకు తెలంగాణా ఫించన్లు ట్రబుల్ ఇస్తున్నాయన్నారు. ప్రజలు తిరగబడతారన్న భయం బిజెపి ని వెంటాడుతుందన్నారు. అందుకే కేంద్రం నుండి రావాల్సిన నిధులకు అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. ముక్కు పిండి వసూలు చేసిన పన్నుల్లో వాటా తిరిగి చెల్లించడం లేదన్నారు. అయినా కొత్తగా పది లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నట్లు తెలిపారు మంత్రి జగదీశ్ రెడ్డి.
వృద్దులకు, వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు ఇస్తున్నామని.. దివ్యాంగులకు 3,016 రూపాయలు ఫించన్ ఇస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కొనియాడారు. 10 లక్షల ఫించన్లను కలుపుకుని మొత్తం తెలంగాణా రాష్ట్రంలో46 లక్షల మంది లబ్దిదారులకు ఫించన్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు.
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంట్ సరఫరా కేవలం ఆరు గంటల మాత్రమేనని.. అక్కడ అరనిమిషం కుడా ఉచిత విద్యుత్ ఇవ్వక పోగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రీడింగ్ ప్రకారమే రైతాంగం నుండి ముక్కు పిండి మరీ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారని అన్నారు.