తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతోంది. దీంతో రాజకీయం వేడెక్కింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో, ఉపాధ్యాయుల బదిలీలపై బీజేపీ పోరాడుతోంది. గత ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్షకు పూనుకుంటే.. కోవిడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని… పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం.. జైలుకు పంపించడం, ఆ తరువాత హైకోర్ట్ ఆదేశాలతో విడుదల కావడం అంతా మనకు తెలిసిందే.
అయితే బీజేపీ ముఖ్య నాయకులు రాష్ట్రానికి వస్తూ… రాష్ట్ర నాయకత్వానికి భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా తో పాటు నిన్న మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ నిరసనల్లో పాల్గొన్నాడు. తాజాగా బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నేడు రాష్ట్రానికి వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ లు స్వాగతం పలుకనున్నారు. రోడ్డు మార్గం ద్వారా హన్మకొండకు చేరుకుని అక్కడ ఉపాధ్యాయుల బదిలీలు, 317 జీవోకు వ్యతిరేఖంగా బీజేపీ చేస్తున్న నిరసనల్లో హిమంత బిశ్వ శర్మ పాల్గొననున్నారు.