మాచర్లలో టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమంపై వైసీపీ చేసిన దమనకాండ మరువక ముందే చెన్నేకొత్తపల్లిలో మరో దుశ్చర్యకు వైసీపీ నాయకులు ఒడిగట్టడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ రెడ్డి అండ్ కో అరాచకాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షం చేస్తున్న కార్యక్రమాలపై అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి నుండి మారుమూల పల్లెల వరకు పులివెందుల ఫ్యాక్షనిజం వైరస్ లా సోకిందనడానికి ఈ దాడులే నిదర్శనమని తెలిపారు. “గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ఆ కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. కానీ నేడు టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలపై, పాల్గొంటున్న కార్యకర్తలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు, హత్యలకు దిగడం ఫ్యాక్షనిస్టుల పాలనకు నిలువెత్తు నిదర్శనం.
తాజాగా సత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లి మండలం, గువ్వలగొందంపల్లిలో మాజీమంత్రి పరిటాల సునీత నిర్వహించిన రైతుకోసం టీడీపీ పాదయాత్రలో పాల్గొన్న ఆటోడ్రైవర్ గోపాల్ కు చెందిన ఆటోను తగులబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ జెండా కట్టినందుకు ఆటోను తగులబెట్టి గోపాల్ కుటుంబ ఆదాయ వనరును నాశనం చేయడాన్ని నిరసిస్తున్నాం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం. పోలీసులు ఇప్పటికైనా స్పందించి గోపాల్ ఆటోను తగులబెట్టిన వైసీపీ దుండగులను అరెస్టు చేసి తగు శిక్ష విధించాలి. గోపాల్ కు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి” అని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.