గుంటూరు దుర్ఘటనకు జగన్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే మంత్రులు మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించకుండా, టీడీపీపై నిందలేస్తూ తప్పుడు ప్రచారానికి ఆగమేఘాలపై బయలుదేరారని మండిపడ్డారు. పోలీసుల అనుమతితో సంక్రాంతి కానుకల పంపిణీ చేపట్టగా.. వేలాది మంది అక్కడకు చేరుతుంటే.. తగిన బందోబస్తు ఏర్పాటు చేసి, రద్దీని క్రమబద్ధీకరించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. కానుకల పంపిణీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందడం బాధాకరమని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.
మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించారు. అయితే.. ఈ దుర్ఘటనకు చంద్రబాబు ప్రచార యావే కారణమని వైసీపీ విమర్శలు చేస్తోంది. నిర్వాహకుల బాధ్యతా రాహిత్యానికి టీడీపీ క్షమాపణలు చెప్పి, ప్రాయశ్చిత్తం చేసుకోడానికి బదులు రాజకీయ లబ్ధి పొందడానికే అచ్చెన్నాయుడు ఉత్సాహం చూపారని ఆయన విమర్శలు తెలియజేస్తున్నాయి. పోలీసులు తక్షణం స్పందించడం వల్లే మిగిలిన వారి ప్రాణాలు కాపాడినట్టు ప్రభుత్వం చెబుతోంది. లేదంటే పెద్ద సంఖ్యలో మృత్యువాత పడేవారని ప్రభుత్వ వాదన. ఏది ఏమైనా రాజకీయ నేతల స్వార్థపూరిత ఆటలో అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా అమాయకుల బతుకులతో చెలగాటం ఆడడం మానుకుంటే మంచిదని పౌర సమాజం హితవు చెబుతోంది.