నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను జరపనున్నారు. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు గణపతి పూజతో కళ్యాణోత్సవాలు ప్రారంభం అయ్యాయి. రెండో రోజు అయిన మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఇక చివరి రోజున ఉదయం 8 గంటలకు మహాశాంతి చండీహోమం, సాయంత్రం 6 గంటలకు రథోత్సవం జరగనుంది. రథోత్సవంలో భాగంగా అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగిస్తారు.
అమ్మవారి కళ్యాణం సందర్భంగా మంగళవారం రోజున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు చీర, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇక కళ్యాణ మాహోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు లింక్, సర్వీస్ రోడ్లను మూసివేసి ఉంటాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ సూచించారు.