తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను బహిరంగలేఖలో అభివర్ణించిన బండి సంజయ్.. 8 ఏళ్ల కేసీఆర్ పాలనంతా రైతుల కంట కన్నీరు `కేసీఆర్ ఫామ్‌హౌస్ పంట పన్నీరుగా మారిందని ఫైర్ అయ్యారు. కేంద్రంపైన, ప్రధానమంత్రి నరేంద్రమోడీపైన గోబల్స్ ప్రచారం చేయడం ఇకనైనా ఆపాలని కేసీఆర్‌కు సూచించిన బండి సంజయ్.. వరిసహా 14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకొని రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని కేసీఆర్ కు సూచించిన బండి సంజయ్.. రూ.7500 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో వెంటనే జమచేయాలని, రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రుతు పవనాలు ప్రవేశించడంతో ఏరువాక ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకం అవసరమని.. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు కోట్ల నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం రైతుబంధుకు, రైతు రుణమాఫీకి సకాలంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రైతుబంధు పథకం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల వద్ద అధిక వడ్డీలకు రైతులు రుణాలు తీసుకుంటూ అప్పుల పాలవతున్నారని.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న రైతుబంధు పథకం నిధులు విడుదలలో ఏటా తీవ్ర జాప్యం జరుగుతోందని బండి సంజయ్ విమర్శలు చేశారు.