పదో తరగతి పరీక్షా పత్రం లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే.. పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ అంశంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అరెస్ట్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో తన ఫోన్ పోయిందంటూ బండి సంజయ్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన ఫోన్ కేసీఆర్ వద్ద ఉందని ఆరోపించారు. తన ఫోన్ కాల్ డేటా చూసి కేసీఆర్ ఆశ్చర్యపోయారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తనకు కాల్స్ చేసిన విషయం చూసి కేసీఆర్ కు నిద్రపట్టడంలేదని బండి సంజయ్ వివరించారు. కాగా, తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ పై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. బండి సంజయ్ తన ఫోన్ అప్పగించడంలేదని, విచారణకు సహకరించడంలేదని ఏజీ కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది.